అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ రోజు సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కోసం కృషి చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నియంత్రణ కోసం కొత్త యాక్షన్ ప్లాన్ త్వరలోనే తీసుకొస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పౌరులను కూడా భాగస్వాములను చేయాలనుకుంటున్నామని అన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయిందని, ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాజకీయ నాయకుల నుంచే ప్లాస్టిక్ నియంత్రణ మొదలు కావాలని, ఫ్లెక్సీల వాడకం కూడా నియంత్రించాలని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఒకసారి వాడిన ప్లాస్టిక్ నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీ సచివాలయాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా ప్రకటించామని చెప్పారు. ప్లాస్టిక్ భూమిలో కలిసి ఎందుకు 300 ఏళ్ళు పడుతుందని, పశువుల కడుపులోకి కాకుండా పసికందుల రక్తంలో కూడా ప్లాస్టిక్ కలిసి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో, నానో ప్లాస్టిక్ రూపంలో మానవ శరీరంలో ప్లాస్టిక్ అవశేషాలు ఉండిపోతున్నాయని అన్నారు.