అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. మనిషికి అన్నింటికంటే ముఖ్యమైంది తిండే కాబట్టి.. ఆ మాట అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఐతే అత్యవసర స్థితిలో ప్రాణాలను నిలబెట్టే రక్తదానం, అవయవదానం లాంటివి కూడా చాలా గొప్పవే. అలాగే పసిబిడ్డలకు అత్యంత ఆవశ్యకమైన తల్లిపాలను దానం చేసే వాళ్లను కూడా ఎంతో గొప్ప వాళ్లుగానే చూడాలి. తల్లిపాలు ఎంత శ్రేష్ఠమైనవో చెప్పాల్సిన పని లేదు.
వాటికి సరితూగే ప్రత్యామ్నాయం మరేదీ లేదు. వందల కోట్లు ఖర్చు చేసినా.. తల్లిపాలతో సమానమైన పోషకాలున్న పాలను తయారు చేయడం సాధ్యం కాదన్నది ఎన్నో పరిశోధనల తర్వాత తేల్చిన విషయం. ఐతే పురిటిలోనే తల్లిని కోల్పోవడం వల్ల కావచ్చు.. మరో కారణం వల్ల కావచ్చు.. తల్లిపాలు అందక ఇబ్బంది పడే చిన్నారులు ఎందరో. అలాంటి వాళ్లకు సాయం చేసే గొప్ప మనసు కొంతమందికే ఉంటుంది.
మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇదే చేసింది. ఆమె 30 లీటర్ల తల్లిపాలను దానం చేయడం విశేషం. 2021లో తమిళ నటుడు విష్ణు విశాల్‌ను పెళ్లి చేసుకున్న జ్వాల.. కొన్ని నెలల కిందటే ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె అనేక ప్రయత్నాల తర్వాత ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బిడ్డను కంది. ఐతే తల్లిపాలను తన బిడ్డకు పరిమితం చేయకుండా.. అవి అందక ఇబ్బంది పడే చిన్నారుల కోసం దానం చేయాలని జ్వాల నిర్ణయించింది. తల్లి పాలు అందక ఇబ్బంది పడే చిన్నారుల గురించి..
ఈ దానం గురించి జనాల్లో పెద్దగా అవగాహన కూడా ఉండదు. ఐతే జ్వాల పెద్ద మనసుతో ఆలోచించి తన వంతుగా 30 లీటర్ల తల్లి పాలు అందజేసింది. ఈ పాలను ప్రాసెస్ చేసి కొన్ని నెలల పాటు స్టోర్ చేసి పెట్టే సౌలభ్యం ఉంది. కొన్ని ఫౌండేషన్స్ ఈ పాలను సేకరించి, తల్లి పాలు అందక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు అందజేస్తాయి. జ్వాల చేసిన గొప్ప పనికి ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.