ప్రపంచ ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 19, 1965న యూక్లిడ్ ఒహియోలో జన్మించిన సునీతా విలియమ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లు బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో జూన్ 2024లో ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. అయితే, ఆ తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలు అక్కడే ఉండిపోయారు. చివరకు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో మార్చి 18, 2025న భూమికి తిరిగి వచ్చారు. గత జన్మదినం అంతరిక్షంలో జరుపుకున్న సునీతా విలియమ్స్...ఈ జన్మదినాన్ని భూమిపై జరుపుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భూమికి వచ్చిన ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సునీతా విలియమ్స్...
భారతీయ మహిళ సాహసానికి నిలువెత్తు రూపం..
ప్రపంచ మగువ తెగువకు అద్దం పట్టిన సజీవ సాక్ష్యం..
పురుషులే సాటిరాని ఆమె తెగింపు
ఆడదాని పట్ల యుగాల నాటి చిన్నచూపునకు ముగింపు..
ధైర్యం ఇంటిపేరు..స్థైర్యం ఒంటిపేరు..
గౌరవం దేశం పేరు..సునీతా విలియమ్స్ అసలు పేరు..!
చిన్నప్పటి నుంచి తన చూపు ఆకసం వైపే..
ఊహకే అందని అంతరిక్షంలోని రహస్యాలను శోధించాలని తలపు..
నింగి తలుపులు తెరిచి గభాలున దూరి..
గబగబా లోన గుట్టుమట్లు తెలుసుకోవాలని..
అక్షరాలు నేర్చినప్పటి నుంచి ఇవే లక్షణాలు..
అప్పటి నుంచి క్షణం క్షణం లెక్కపెడుతూ ఆ తరుణం
రాగానే తక్షణం గగనంలోకి దూసుకెళ్లిన మానవ విమానం..
మహిళా సాధికారతకు సిసలైన కొలమానం..!
అరవై రెండు గంటలపాటు అంతరికక్షంలో నడక..
మంచుపర్వతాలపై స్కేటింగ్..
కొండలపైకి గమనం..
సముద్రంలో ఈత..
విమానం నుంచి దబ్బున దూకేసే పారాచ్యుట్ విన్యాసం..
వీటన్నిటినీ మించిన సాహసం.. సునీత సొంతం..
ప్రమాదభరితమే ఆసాంతం..
అయినా చెదరని దీక్ష..విశ్వాసమే రక్ష..
సునీత ప్రతి అడుగు..విజయంవైపు వెనకంజ వేయని పరుగు..!
ఒకనాటికి పరిశోధన ముగిసి నేలపైకి తిరుగుపయనం
అనగా తలెత్తిన సమస్య..
దారీతెన్నూ..దిక్కూమొక్కూ లేని..
శూన్యంలో..దైన్యం దరి చేరనీయక..!
ఒక్కరోజు ఎక్కడైనా ఉండిపోవాల్సి వస్తే ఊరంత హంగామా..
మరి అంతరిక్షంలో 688 రోజులు..
అనుకున్న లక్ష్యాన్ని మించి..అంతరిక్షంలో నివాసం..
ఎక్కివెళ్లిన నౌకే ఆవాసం..
బండి ఎక్కి రాడానికి ఎమర్జెన్సీ కోటా లేదు.. తత్కాల్ ఊసే లేదు..
భూమిపై నుంచి రావాల్సిందే కాల్...
నాసా ఇస్తేనే వీసా..పరిశోధనే కాలక్షేపం..
అలాగే..అలాగే.. చరిత్ర పుటల్లో సునీతా విలియమ్స్ పేరు నిక్షేపం...!
ఆమె..భూమిపైకి దిగివచ్చిన వేళ..
అల నీలి గగనాల నుంచి ఓ ధృవతార నేలపైకి
మేఘాల రథంపై..తరలి వచ్చినట్టే..
నింగి నుంచి దిగివచ్చినా సునితా విలియమ్స్
ఈ జగతి ఆమె వైపు తలెత్తే చూసింది..
అబ్బురంగా..అపురూపంగా..!