డాలర్ డ్రీమ్స్ కు ట్రంప్ చెక్..హెచ్1బీ వీసాలపై షాకింగ్ నిర్ణయం

admin
Published by Admin — September 20, 2025 in Nri, International
News Image

అమెరికాలో ఉద్యోగం చేయడం, అక్కడ స్థిర పడడం చాలా మంది భారతీయుల కల. తమ డాలర్ డ్రీమ్స్ ను వెతుక్కుంటూ ఎంతోమంది భారతీయులు అమెరికాలో అడుగుపెడుతుంటారు. తల్లిదండ్రులు  అప్పుసప్పు చేసి...బ్యాంకుల్లో ఆస్తులు తాకట్టు పెట్టి మరీ తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వారిని సప్త సముద్రాలు దాటించి అమెరికాకు పంపిస్తుంటారు. అయితే, అనూహ్యంగా భారతీయుల డాలర్ డ్రీమ్స్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్నం చేశారు.  హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు.

అమెరికాలో ఉన్న కంపెనీలు భారతీయులనుగానీ, ఇతర దేశాలకు చెందిన నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే హెచ్1బీ వీసాపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలామందిపై భారం కానుంది. వాస్తవానికి ట్రంప్ నకు లోకల్ సెంటిమెంట్ ఎక్కువ. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్ అన్న నినాదాన్ని ట్రంప్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంటారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోతున్నారన్నది ట్రంప్ వాదన. అయితే, భారతీయులతోపాటు కొన్ని దేశాలకు చెందిన ఉద్యోగులు చాలామంది అమెరికన్ ఉద్యోగుల కంటే బాధ్యతగా పనిచేస్తారని చాలా కంపెనీలు అభిప్రాయపడుతుంటాయి. కానీ, ట్రంప్ అలా ఆలోచించడం లేదు. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికాలోని కంపెనీలు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే అమెరికాలోని గొప్ప యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమెరికన్లకు ఇవ్వాలన్నది ట్రంప్ నిర్ణయం. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపడమే ట్రంప్ ముఖ్య ఉద్దేశ్యం. చైనాతోపాటు భారత్ కు చెక్ పెట్టేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు యాపిల్, గూగుల్, మెటా ఇంకా స్పందించాల్సి ఉంది.

అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు హెచ్-1బీ వీసాను 1990లో తీసుకువచ్చారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దారుల్లో భారత్ 71 శాతం వాటా కలిగి ఉంంది. చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. ప్రతి ఏటా 85 వేల హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులను లాటరీ విధానం ద్వారా ఆహ్వనిస్తుంది. చాలాసార్లు కంపెనీలే ఈ వీసా చార్జీలు భరిస్తాయి. తాజా నిర్ణయంతో హెచ్1బీ వీసా ఛార్జీలు కంపెనీలకు భారంగా మారనున్నాయి.

Tags
USA President Trump Shattered Dollar Dreams Indians H-1B visa fees hike $100000 a year
Recent Comments
Leave a Comment

Related News