2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన చాలామంది వైసీపీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. జగన్ ఒంటెత్తు పోకడ, నియంత ధోరణి నచ్చక బాలినేని శ్రీనివాస రెడ్డి వంటి కీలక నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు జగన్ కు షాకిచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తాజాగా టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అమరావతిలోని సీఎం క్యాంపు ఆఫీసులో వారిని టీడీపీలోకి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఆ ఎమ్మెల్సీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ముగ్గురి రాకతో శాసనమండలిలో టీడీపీ బలం మరింత పెరిగినట్లయింది. బల్లి కల్యాణ్ చక్రవర్తి పదవీకాలం 2027 వరకు ఉంది. మర్రి రాజశేఖర్, పద్మశ్రీ పదవీకాలం 2029 వరకు ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఓ వైపు మండలిలో బలం ఉంది కాబట్టి అక్కడ గట్టిగా పోరాడాలని వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ చెబుతున్నారు. అదే సమయంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు టీడీపీలో చేరుతున్నారు. ఏపీ రాజకీయాలలో జగన్ ప్రాభవం..ప్రభావం నానాటికీ తగ్గిపోతున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.