పోసాని కోసం పోలీసులు పోటీ.. ఇక బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్ట‌మేనా?

News Image
Views 4 Views
Shares 0 Shares

సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి చుట్టూ ఉచ్చు మ‌రింత‌ బ‌లంగా బిగుసుకుంటోంది. పోసానిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు తెగ పోటీ ప‌డుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఇప్పటికే పోసాని రాజంపేట సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ హ‌యాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ప్రతిపక్షంలో ఉన్న వారిపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలతో పోసాని నోరు పారేసుకున్నారు. ఫ్యాన్‌ పార్టీ పెద్ద అదేశాల‌తో ప్రెస్‌మీట్లలలో, సోషల్ మీడియాలో బూతులు తిడుతూ.. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ రెచ్చిపోయారు.

దాని ఫ‌లితంగా కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు పోసానిపై వ‌రుస కేసులు న‌మోదు అవుతున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా ఆయ‌న‌పై ఏకంగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లతో పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్‌జైలుకు దారిపట్టారు. అయితే నేడు రాజంపేట సబ్ జైల్ వద్ద ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. ఏపీలోని మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు పోసాని కృష్ణ మురళిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి సబ్ జైల్ వద్దకు వచ్చారు.

నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించి.. త‌మ‌కు ముందు అంటే త‌మ‌కు ముందు పోసానిని అప్ప‌గించాల‌ని పోటీ ప‌డ్డారు. అయితే నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతి తీసుకోవ‌డంతో జైలు సిబ్బంది నిబంధనల ప్ర‌కారం.. వారికే పోసానిని అప్ప‌గించారు. వైద్య పరీక్షలు పూర్తి చేసి పోసానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసారవుపేటకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం నిర్ణయం మేరకు పోసానిని నరసారావుపేట సబ్ జైలులో ఉంచుతారా లేక రాజంపేటకు తరలిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది. కాగా, పోసాని త‌ర‌ఫు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల న‌డుమ ఇప్ప‌ట్లో పోసాని బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్ట‌మే అంటున్నారు రాజ‌కీయ నిపుణులు.

Recent Comments
Leave a Comment

Related News