మండలిలో మంటలు.. బొత్స వ‌ర్సెస్ అచ్చెన్నాయుడు!

admin
Published by Admin — March 03, 2025 in Politics
News Image

శాసనమండలిలో సోమ‌వారం బడ్జెట్ ప‌ద్దుల‌పై చర్చ సందర్భంగా అధికార కూటమి సభ్యులు, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య మాటల మంటలు రేగాయి. ప్రభుత్వంపై బురద చల్ల‌డ‌మే పనిగా పెట్టుకున్న వైసీపీకి కూటమి సభ్యులు ధీటుగా స‌మాధానం ఇస్తున్నారు. మండ‌లిలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు , విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది.

లబ్దిదారులకు రాజకీయాలు, పార్టీలను అంటగడతారా? అంటూ కౌన్సిల్ లో బొత్స ఫైర్ అయ్యారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాద‌ని.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడిన మాటలకు బాబు సిగ్గుపడాలని బొత్స విమ‌ర్శించారు. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కేవలం వారి పార్టీ కార్యకర్తలకు ఇవ్వమనడానికి ఇదేమైనా వాళ్ళ సొంత ఆస్తా? అని ప్రశ్నించారు. త‌మ‌ ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చామ‌ని.. అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంద‌ని బొత్స హిత‌వుప‌లికారు. కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న మానేసి రాజ‌కీయాలు చేస్తుంద‌ని మండిప‌డ్డారు.

అయితే బొత్స వ్యాఖ్య‌ల‌కు మంత్రి అచ్చెన్నాయుడు అంతే స్ట్రోంగ్ గా కౌంట‌ర్ ఇచ్చా రు. చంద్రబాబు గారి మాటలు వైసీపీ స‌భ్యులు కుట్రపూరితంగా వక్రీకరిస్తున్నార‌ని అచ్చ‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా పార్టీకి ఎన్నికల వరకే రాజకీయాలు. మీలాగా మా పార్టీకి రంగుల పిచ్చ లేదు. మా ప్రభుత్వానికి పేదవారు మాత్రమే ప్రామాణికమ‌ని మంత్రి అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు వస్తాయ‌ని.. ఏ ఒక్క అర్హుడికి పథకాలు అందకపోయినా మా దృష్టికి తీసుకురావాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

అలాగే గ‌త వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదని.. కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే కథ నడిపార‌ని అచ్చెన్నాయుడు దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని.. ఒక‌వేళ ఖ‌ర్చు పెడితే వివ‌రాలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో పోర్టులు అన్నీ మేమే కట్టేశాం, ఆస్తులు సృష్టించామ‌ని సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకుంటున్న వైసీపీ అస‌లు లెక్క‌లను కూడా అచ్చెన్న బ‌య‌ట‌పెట్టారు.

Recent Comments
Leave a Comment

Related News

Latest News