మాజీ సీఎం జగన్ పాలనను ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు. విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిన వారు విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. జగన్ చేతగాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో పయనించిందని దుయ్యబట్టారు. జగన్ అసమర్థత, అహంకారం వల్లే రూ. 400 కోట్లతో నిర్మించిన పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు.
కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్ర జలసంఘం సూచించినా జగన్ పెడచెవిన పెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసి, పోలవరానికి పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు. ఇక, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసే నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదని చంద్రబాబు అన్నారు. ఇది ప్రైవేటీకరణ కాదని, బెదిరింపులకు భయపడి మంచి నిర్ణయాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పీపీపీ విధానం వల్ల ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. హైవేలను కూడా గతంలో పీపీపీ పద్ధతిలో నిర్మించారని, అంతమాత్రాన ఆ రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసినట్టా? అని ప్రశ్నించారు.
ఆస్తి ప్రభుత్వానిదేనని, గడువు ముగిశాక ప్రభుత్వానికే అప్పగిస్తారని చెప్పారు. అదేవిధంగా మెడికల్ కాలేజీల యాజమాన్యం కూడా ప్రభుత్వానిదేనని క్లారిటీనిచ్చారు. ఈ విధానం ద్వారా నాణ్యత పెరిగి, పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందుతాయని చంద్రబాబు అన్నారు. హంద్రీ నీవా ద్వారా కుప్పం ప్రజలకు నీరు అందించి వారి రుణం తీర్చుకున్నానని చంద్రబాబు భావోద్వేగంతో ప్రస్తావించారు. పులివెందులకు కూడా నీరిచ్చింది తానే అని గుర్తు చేసుకున్నారు.