ఏపీ శాసనసభ వేదికగా వివేకా హత్య కేసు గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద గారిది హత్య అని మనందరికీ కళ్ల ముందు తెలుసని, కానీ ఆ కేసులో మనం ఇంకా ఏమీ చేయలేకపోతున్నామని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు, సభలో ప్లాస్టిక్ నియంత్రణ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అందుబాటులో ఉండడం లేదంటూ బొండా ఉమ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. కాలుష్య నియంత్రణ మండలి అందుబాటులో ఉండదనే మాట సరికాదని, తన మాటలను ఉమ సరిదిద్దుకోవాలేమో తెలియదని చెప్పారు. కాలుష్య నియంత్రణ మండలి అంటే పరిశ్రమలకు మాత్రమే సంబంధించినది కాదని, ప్రజలకు కూడా సంబంధించినదని చెప్పారు. ఎవరు వెళ్లినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం అందరికీ అందుబాటులో ఉంచామని చెప్పారు. అయితే, కాలుష్య నియంత్రణ మండలి బోర్డులో తీవ్రమైన సిబ్బంది కొరత, నిధుల సమస్య ఉందని పవన్ అంగీకరించారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని సభకు హామీ ఇచ్చారు.
రాంకీ సంస్థ నిబంధనలు ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకున్నామని చెప్పారు. కేవలం ఒక సంస్థనో, ఒక వ్యక్తినో లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ విధానం కాదని అన్నారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టకుండా, వారితో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటామన్నారు. నిబంధనలు అతిక్రమించే పరిశ్రమలపై మరీ కఠినంగా వ్యవహరిస్తే చాలా కంపెనీలు మూతపడిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, ప్రజలు ప్లాస్టిక్ వాడి పడేస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గానీ, మేము గానీ వెళ్లి ప్రతీచోట శుభ్రం చేయలేం కదా అని అన్నారు.