హెచ్ 1 బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. ఏడాదికి హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లకు పెంచడంతో భారతీయులకు గట్టి షాక్ తగిలింది. దీంతో, అమెరికా వెలుపల ఉన్న తమ హెచ్1బీ వీసా ఉద్యోగులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని పలు ఐటీ కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు, ఎప్పటి నుంచో వార్తల్లో నిలిచిన ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాను ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ గోల్డ్ కార్డ్ ధర 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమాకూరే అవకాశముంది. విదేశీ ఉద్యోగుల కోసం ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా కార్యక్రమం ప్రారంభించారు. ట్రంప్ గోల్డ్ కార్డ్, ట్రంప్ ప్లాటినం కార్డ్, వ్యాపారస్తులకు ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్ జారీ చేస్తారు.
ట్రంప్ గోల్డ్ కార్డ్:
10 లక్షల డాలర్లు (దాదాపు 8.8 కోట్ల రూపాయలు) చెల్లించి ఈ కార్డు సొంతం చేసుకోవచ్చు. నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు అప్లికేషన్‌ను సమర్పించి ఈ కార్డ్ పొందవచ్చు. ఈ గోల్డ్ కార్డ్ మంజూరైతే అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో ఎక్కడికైనా ఉపయోగించుకోవచ్చు.
ట్రంప్ ప్లాటినం కార్డ్:
50 లక్షల డాలర్లు (దాదాపు 44 కోట్ల రూపాయలు) చెల్లించి ట్రంప్ ప్లాటినం కార్డ్ పొందవచ్చు. ఈ కార్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు. కానీ, ప్లాటినం కార్డ్ కావాలనుకునే వారు సైన్ అప్ చేసి వెయిటింగ్ లిస్ట్‌లో ఉండాలి. సంబంధిత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పరిశీలన కోసం వెయిట్ చేయాలి. ఈ కార్డు ద్వారా అమెరికాలో 270 రోజుల వరకు ఇతర దేశాల్లో సంపాదించే ఆదాయంపై పన్ను కట్టకుండా గడపవచ్చు
ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డ్:
విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలు ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం కార్పొరేట్ కంపెనీలు 20 లక్షల డాలర్లు (17 కోట్ల రూపాయలు) చెల్లించాలి. ప్రాసెసింగ్ రుసుము చెల్లించి డీహెచ్‌ఎస్ పరిశీలన కోసం వెయిట్ చేయాలి. స్వల్ప వార్షిక నిర్వహణ రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది.