అమీషా పటేల్.. ఈ పేరు చెప్పగానే 2000 ప్రాంతంలో కుర్రాళ్లుగా ఉన్న వాళ్లందరి మనసు పులకరిస్తుంది. హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ ‘కహోనా ప్యార్ హై’తో కథానాయికగా పరిచయం అయిన ఈ ముంబయి బ్యూటీ.. అప్పటి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. తర్వాత తెలుగులో ‘బద్రి’ సినిమా చేసి ఇక్కడా బలమైన ఇంపాక్ట్ వేసింది. కానీ కెరీర్లో ఒక దశ దాటాక ఆమె సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. లైమ్ లైట్‌కు దూరమైంది.
ఐతే సినిమా ఛాన్సులు తగ్గినా అమీషా పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో ఏమీ సెటిల్ కాలేదు. 50 ఏళ్ల వయసు వచ్చినా ఆమె సింగిల్‌గానే ఉండిపోయింది. ఈ వయసులోనూ హాట్ హాట్ ఫొటో షూట్లతో కుర్రాళ్ల దృష్టిని ఆకర్షిస్తున్న అమీషా.. తాను ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవడానికి ఒక ఇంటర్వ్యూలో కారణం చెప్పింది.
తాను అమీషా పటేల్‌గా ఉండడానికే ఇష్టపడతానని.. ఇంకొకరి భార్య అనే గుర్తింపు తనకు వద్దని అమీషా పేర్కొంది. చాలా ఏళ్ల పాటు తాను ఒకరి కూతురు అనే గుర్తింపుతోనే బతికానని.. ఇప్పుడు మరొకరి భార్య అనిపించుకోవాలని తనకు లేదని ఆమె స్పష్టం చేసింది. ఐతే కెరీర్ ఆరంభంలోనే మంచి బ్రేక్ అందుకుని తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అమీషా.. ఒక తండ్రికి కూతురు అనే గుర్తింపుతో బతికానని చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పెళ్లి చేసుకున్నా సరే.. ఆమెను జనం అమీషాగా చూస్తారు తప్ప.. ఆమె భర్తకు భార్యగా ఎందుకు చూస్తారన్నది అర్థం కాని విషయం. చాలా విడ్డూరంగా అనిపిస్తోందీ వాదన.
ఇదిలా ఉండగా.. తాను నటి కాకముందే ఒక వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమించానని.. కానీ తాను సినిమాల్లో ఉండకూడదని ఆ వ్యక్తి చెప్పడంతో తనకు దూరమయ్యానని అమీషా తెలిపింది. ప్రేమ కోసం కెరీర్ పరంగా తాను కొన్ని త్యాగాలు చేశానని.. అలాగే కెరీర్ కోసం ప్రేమనూ త్యాగం చేశానని ఆమె పేర్కొంది. ఇకపైనా తాను సింగిల్‌గానే ఉండబోతున్నట్లు ఆమె స్పష్టం చేసింది.