అవును.. పానీపూరీ కారణంగా గుజరాత్ లోని వడోదర నగరంలో చోటు చేసుకున్న హడావుడి అంతా ఇంతా కాదు. వడోదర నగరంలోని సుర్ సాగర్ ప్రాంతానికి చెందిన ఒక యువతి తనకెంతో ఇష్టమైనా పానీపూరీ తినేందుకు వెళ్లింది. వ్యాపారి రూ.20 తీసుకొని నాలుగు పానీపూరీ ఇవ్వటంతో ప్రశ్నించింది. ఎప్పటిలా రూ.20కు ఆరు ఇవ్వాలి కదా? నాలుగే ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించింది.
అయితే.. ఇటీవల కాలంలో ముడిసరుకుల ధరలు పెరిగాయని.. అందుకే ప్లేటుకు ఆరు కాస్తా నాలుగుకు తగ్గించినట్లు సదరు వ్యాపారి వెల్లడించాడు.ఈ సమాధానంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మహిళ.. పెద్దగా అరుస్తూ రద్దీగా ఉన్న రోడ్డు మధ్యకు ఏడుస్తూ వెళ్లి కూర్చుంది. పానీపూరీ షాపు వ్యక్తికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఆమె కారణంగా ఒక్కసారిగా ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది.
ఆమెను సముదాయించేందుకు వాహనదారులు ప్రయత్నించినా ఆమె మారలేదు. దీంతో.. పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.పానీపూరీ అమ్మకందారుపై ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ.. రోడ్డు మీద ధర్నాకు దిగిన ఆమెను ఫోటోలు తీసేందుకు.. వీడియోలు తీసేందుకు పలువురు ఆసక్తిని ప్రదర్శించటమే కాదు.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది కాస్తా వైరల్ గా మారింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు సర్దిచెప్పటంతో పాటు.. పానీపూరీ ధరల పట్టిక బోర్డును ఏర్పాటు చేయాలని షాపు వ్యక్తికి చెప్పి ఆమెను పంపేశారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా పలువురు మాట్లాడుకునేలా చేసింది.