జగన్ హయాంలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలిందని టీడీపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో వైసీపీ నేత తురకా కిషోర్ గతంలో సృష్టించిన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం మాచర్లలో పర్యటించిన టిడిపి నేతల వాహనంపై తురకా కిషోర్ కర్రలతో దాడి చేసిన వీడియో అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత తురకా కిశోర్ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే స్వర్ణాంధ్ర-స్వచంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు మాచర్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని, ఎన్నో అరాచకాలు జరిగాయని చంద్రబాబు అన్నారు. తనవంటి నాయకుడు మాచర్లకు వచ్చే పరిస్థితి గతంలో లేదని , ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. పల్నాడులో ప్రజలపై దాడులు చేయొద్దని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నేరాలు-ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చెత్త తొలగించడంతోపాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సూపర్ సిక్స్ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని, 12 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందజేశామని చెప్పుకొచ్చారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయని, డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు నిజమైన దసరా, దీపావళి ఒకేసారి వచ్చాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పారు. స్వచ్ఛ వాహనాలు ప్రజల ఇంటి దగ్గరకు వస్తాయని, పాత వస్తువులు ఇస్తే వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పారు. ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా మారుస్తామని అన్నారు.