కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను సైతం వైసీపీ నేతలు వదలడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి సొత్తును వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పరకామణిలో 100 కోట్లను వైసీపీ నేతలు కొట్టేశారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ వ్యవహారంపై మంత్రి లోకేశ్ స్పందించారు. జగన్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని లోకేశ్ విమర్శించారు. గనులు, భూములు, అడవులు..ఇలా సమస్త వనరులతో పాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్ చివరకు తిరుమల శ్రీవారి సొత్తును వదల్లేదు అని లోకేష్ మండిపడ్డారు.
తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని లోకేష్ ఆరోపించారు. వందల కోట్ల రూపాయల విలువైన సొత్తును కొల్లగొట్టారని, ఆ డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. భూమన మొదలు తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారని లోకేష్ అన్నారు.
భక్తులు శ్రీవారి కోసం హుండీలో వేసిన కానుకల దోపిడీ కేసులో రవికుమార్ తో రాజీ చేసేందుకు భూమన ప్రయత్నించారని ఆరోపించారు. ఆనాడు అధికార పార్టీ అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదని అన్నారు. జగన్, భూమన కలిసి ఏకంగా పరకామణినే దోచేశారని, ఆ వీడియోలు ఈరోజు బయటపడ్డాయని చెప్పారు. రేపో మాపో నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని లోకేష్ అన్నారు.