ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం విధానంపై విమర్శలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లకు.. ఈ నెల 1వ తేదీతో సమయం గడిచిపోయింది. దీంతో తిరిగి లైసెన్సు పొందే అవకాశం కల్పించినా.. సర్కారు పలు నిబంధనలు విధించింది. ఒక్కొక్క బార్‌కు నాలుగు అప్లికేషన్లు రావాల్సిందేనని పట్టుబట్టింది. అంతేకాదు.. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.10 లక్షల వరకు ఫీజును నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు రెండు మాసాలుగా నాలుగుసార్లు దరఖాస్తుల గడువు పొడిగించినా.. 438 బార్లకు ఒక్క టెండరు కూడా పడలేదు.
దీంతో ప్రభుత్వ మళ్లీ మళ్లీ దరఖాస్తుల గడువు పెరుగుతూనే ఉంది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే విషయంపై సర్కారు కొన్నాళ్లుగా తల పట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా వెలుగు చూసిన వ్యవహారం విస్మయానికి గురి చేస్తోంది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో బార్లకు టెండర్ వేసే ప్రక్రియలోనే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని.. ఓ బారష్ యజమాని సెల్ఫీ వీడియోలో నిప్పులు చెరిగారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అనుమతి ఉంటేనే బార్లకు టెండర్లు వేయనిస్తున్నారని బాధితుడి సెల్ఫీ వీడియోలో ఆరోపించారు.
ప్రస్తుతం నాలుగోసారి పొడిగించిన బార్ల దరఖాస్తులకు 20వ తేదీ(శనివారం)తో గడువు ముగుస్తుంది. దీంతో విజయ వాడకు చెందిన బార్ యజమాని ఒకరు 23 లక్షలరూపాయల(రెండు దరఖాస్తుల సొమ్ము) సొమ్ముతో ఎక్సైజ్ ఆఫీసు కు వచ్చారు. అయితే.. ఆయన నుంచి టెండర్ దరఖాస్తు తీసుకోవడానికి ఎక్సైజ్ సీఐ రమేష్ నిరాకరిస్తున్నారని.. యజమాని గణేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా బొండా ఉమాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను అమలు చేయలేకపోతున్నారని.. అధికారులపైనా మండిపడ్డారు. తన టెండర్ పత్రాలు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా..
కాగా.. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని తెలుస్తోంది. తమకు ముందుగానే ముడుపులు సమర్పించాల్సిందేనని.. టీడీపీ ఎమ్మెల్యేలు షరతులు విధించడంతోపాటు యజమానులపైనా ఒత్తిడి పెంచుతున్నారు. ఇదేసమయంలో బెదిరింపులు.. హెచ్చరికలు కూడా కామన్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఇప్పటికి పదే పదే దరఖాస్తుల గడువు పెంచినా.. 438 బార్లకు దరఖాస్తులు రాలేదు. మరి దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తమ్ముళ్లను అదుపు చేస్తారా? లేదా.. వదిలేస్తారా? అనేది చూడాలి.