హెచ్ 1బీ వీసాల దరఖాస్తు రుసుముపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ వీసాల దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులను, ప్రవాస భారతీయులను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని మోదీ అభిప్రాయపడ్డారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, ఆ శత్రువును ఓడించాలని అన్నారు.
విశ్వ బంధు స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. విదేశాలపై ఎక్కువ ఆధారపడితే దేశాభివృద్ధి విఫలమవుతుందన్నారు. భారత్ ఆత్మ నిర్భర్ గా మారాలని, చిప్ (సెమీ కండక్టర్) నుంచి షిప్ వరకు అన్నీ మనదేశంలోనే తయారు కావాలని చెప్పారు. భారతీయుల వారసత్వ ప్రతిభను కాంగ్రెస్ అణచివేసిందని దుయ్యబట్టారు. గుజరాత్ లోని భావ్ నగర్ లో పర్యటించిన మోడీ 34వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను, ప్రాజెక్టులను ప్రారంభించారు.
దేశంలో నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించకుండా విదేశీ నౌకలను అద్దెకు తీసుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించారు. అందుకే దేశంలో షిప్పింగ్ రంగం కుప్పకూలిందని, 90 శాతం వాణిజ్యం కోసం విదేశీ నౌకలపై ఆధారపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. షిప్పింగ్ సంస్థలకు చెల్లించే అద్దె మన రక్షణ బడ్జెట్ తో ఇది సమానం అని చెప్పారు.