వైసిపి నాయకురాలు, మాజీమంత్రి విడదల రజినీకి మరింత సగ పెరుగుతుందా; మరింతగా ఆమె రాజకీయంగా దూకుడు పెంచాల్సిన అవసరం ఏర్పడుతుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విడుదల రజిని గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి హయాంలో తొలిసారి 2019లో విజయం దక్కించుకున్న రజని జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు.
ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి చిలకలూరిపేటకు చేరుకున్నప్పటికీ, అంతర్గతంగా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. అయితే, నిన్నటి వరకు ఉన్న తీరు వేరు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులు వేరు. చిలకలూరిపేట కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తాజాగా టిడిపిలో చేరారు. వాస్తవానికి ఆయన చాలా రోజుల కిందటే వైసీపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందాల్సి ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన తర్వాత చిలకలూరిపేట లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు వేరువేరుగా ఉన్న పత్తిపాటి పుల్లారావు... మర్రి రాజశేఖర్ శిబిరాలు రెండు ఇప్పుడు ఒకే గూటికి చేరాయి. ఇరుపక్షాలు సైకిల్ ఎక్కేశాయి. దీంతో మరింతగా టిడిపి బలం పొంజుకుందనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు ఇప్పుడు విడుదల రజిని ఒంటరి అయ్యారు అనే మాట కూడా వైసిపి వర్గాల్లోనే చర్చగా మారింది. గత ఎన్నికలకు ముందు వరకు మర్రి రాజశేఖర్ బలమైన మద్దతుదారిగా వైసీపీని నడిపించారు.
ఆయనకు గ్రామాల్లోనూ అదే విధంగా నగరంలోనూ కూడా మంచి పట్టు ఉంది. పైగా కమ్మ సామాజిక వర్గంలో మంచి నాయకుడిగా, వివాద రహితుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో వైసిపి 2019లో గెలిచేందుకు మార్గం సుగమం అయింది. ఎప్పుడైతే రాజశేఖర్ కు అన్యాయం చేశారనే వాదన బలం బలపడిందో.. అప్పుడే వైసిపి బలహీన పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా టిడిపిలోకి చేరిపోవడంతో వైసిపి మరింత డీలా పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అటు పత్తిపాటి పుల్లారావుకి బలమైన మద్దతుదారులు ఉన్నారు.
ఇటు మర్రి రాజశేఖర్ కి కూడా బలమైన మద్దతుదారులు ఉన్నారు. ఇప్పుడు ఈ మద్దతుదారులందరూ కలిసి ఒకే గూటికి చేరడంతో విడుదల రజినీని వ్యతిరేకించే వర్గం ఈ శిబిరాలకు మద్దతుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో విడుదల రజని ఒంటరి కావటం, వైసిపి బలం తగ్గటం వంటివి భవిష్యత్తులో ఆమె రాజకీయాలను శాసించే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి విడుదల రజిని పుంజుకుంటే సరే సరి. లేకపోతే మరోసారి ఓటమి తప్పదు అన్న అంచనాలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.