ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా? వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాజీనామా వ్యూహంతో సీరియస్‌గా ఆలోచనలు చేస్తున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. అసెంబ్లీకి హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్నారన్న కారణంతో ప్రభుత్వం జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఈ తరుణంలో జగన్ ముందుగానే ప్రత్యామ్నాయ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనర్హతతో కుర్చీ కోల్పోవడం కన్నా స్వచ్ఛంద రాజీనామా చేయడం మంచిదని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 24వ తేదీ కీలక మలుపు కాబోతోంది.
జగన్ ఇప్పటికే బెంగళూరులో బేస్ వేసుకుని, అక్కడ నుంచే పార్టీ వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే అసెంబ్లీ ప్రారంభం రోజు వచ్చి, నేతలతో సమావేశం అయి తిరిగి బెంగళూరు వెళ్లిపోవడం కూడా సర్వసాధారణంగా మారింది. ఇది ప్రతిపక్ష పార్టీలకు బలమైన ఆయుధంగా మారింది. అనర్హత వేటు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జగన్ ఈ నెల 24వ తేదీన ప్రత్యేకంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ తప్పనిసరిగా హాజరు కావాలి అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆ రోజునే రాజీనామాలపై చివరి నిర్ణయం తీసుకోబోతున్నారని.. రాజీనామా పత్రాలు సిద్ధం చేయమని సూచించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం జగన్ ముందున్నది రెండే దారులు.. ఒకటి అసెంబ్లీకి వెళ్లడం. కానీ ఇది ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే, గతంలో ఆయన తాను మళ్లీ అసెంబ్లీ గడప దాటేది ముఖ్యమంత్రిగా మాత్రమే అని ఘోషించారు. ఇప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తే, ప్రజల ముందు ఆయన మాటల విలువ తగ్గిపోతుంది. ఇక రెండో మార్గం రాజీనామా చేయడం.. దీని ద్వారా ఆయన తనకు అన్యాయం జరుగుతోందని, హోదా ఇవ్వకపోవడం వల్లే తాను ప్రజల్లోకి వస్తున్నానని చెప్పి సానుభూతి వాతావరణం సృష్టించుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆయనను తాత్కాలికంగా రాజకీయ ఇబ్బందుల నుంచి బయటపడేసే దారి కూడా అవుతుంది.
ఈ నేపథ్యంలో 24వ తేదీ సమావేశం వైసీపీ భవిష్యత్ వ్యూహానికి కీలకమవనుంది. ఆ రోజు రాజీనామాల నిర్ణయం తీసుకుంటే, పార్టీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లి అన్యాయం.. ఆవేదన.. ఆత్మగౌరవం అనే త్రిసూక్తితో రాజకీయ వేదికను వేడెక్కించే ప్రయత్నం చేయవచ్చు. ఏపీలో ఇప్పటికీ ప్రభావవంతమైన ప్రతిపక్షం లేకపోవడం వైసీపీకి ప్లస్. ఇలాంటి పరిస్థితిలో రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళితే, ప్రజల సానుభూతి పొందవచ్చని జగన్ భావిస్తున్నారు.