దేశవ్యాప్తంగా సోమవారం నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త రేట్లు అమలు తర్వాత వంటగది సామాన్లు నుండి ఎలక్ట్రానిక్స్, మందులు, గృహ ఉపకరణాలు, ఆటోమొబైల్స్ వరకు దాదాపు 375 వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. అయితే జీఎస్టీ కొత్త స్లాబుల అంశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రియాక్షన్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
`జీఎస్టీ పునర్నిర్మాణం అనేది సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. ప్రతి పౌరుడికి వస్తువులు, సేవలను మరింత సరళంగా మరియు సరసమైనదిగా చేయడానికి ఇది ప్రశంసనీయమైన చర్య. అక్కడక్కడా కొన్ని లోపాలు, కొన్ని ఫిర్యాదులు ఉండొచ్చు కానీ ఈ ప్రక్రియ ప్రయోజనాలు తుది వినియోగదారులకు అందుతాయని నేను ఆశిస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగం మరియు పెట్టుబడికి అవసరమైన ప్రేరణనిస్తుంది.` అంటూ జగన్ ట్వీట్ చేశారు.
సాధారణంగా సెంటర్ తీసుకునే ఆర్థిక నిర్ణయాలపై ప్రతిపక్ష నాయకులు విమర్శనాత్మకంగా మాట్లాడటం ఎప్పుడూ జరిగేదే. కానీ జగన్ మాత్రం మోదీ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురిపించడం ఆయన మార్క్ వ్యూహాన్ని చూపిస్తోంది. ఇటీవల ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చింది. ఆ ఓటు తర్వాత ఇప్పుడు జీఎస్టీ రీఫార్మ్స్‌పై సానుకూల వ్యాఖ్యలు రావడం, వైసీపీ-ఎన్డీఏ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని సూచిస్తుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్డీఏ మిత్రపక్షాలు జగన్ వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకుంటూ, ఆయన పాలిటికల్ లాంగ్వేజ్ మారుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ శ్రేణులు మాత్రం జగన్ చేసిన ఈ ప్రశంస వెనుక రాజకీయ ఉద్దేశమే ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రాన్ని మెప్పించడమే జగన్ వ్యూహమని ఆరోపిస్తున్నాయి. అయితే వైసీపీ ఇప్పుడు పవర్ లేని ప్రతిపక్షం. అలాంటి సమయంలో కేంద్రంతో దూరం పెట్టుకోవడం కన్నా దగ్గర కావడం రాజకీయంగా లాభదాయకమని వైసీపీ భావిస్తున్నట్లు పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.