వైసీపీ వైపు బాలినేని చూపు.. యూటర్న్ ఖాయ‌మేనా?

admin
Published by Admin — September 23, 2025 in Politics, Andhra
News Image

ఏపీ రాజకీయాల్లో మరోసారి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేని, ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత దగ్గరగా ఉంటూ, కొత్తగా రాజకీయాలకు ఊపు తీసుకురావచ్చని ఆశించారు. కానీ ఇప్పుడు ఆయన మనసు మార్చుకుంటున్నారా? తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

బాలినేనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. రాజశేఖర్ రెడ్డి సన్నిహిత బంధువుగా ఆయన గుర్తింపు పొందారు. వైసీపీలో ఉన్నప్పుడు మంత్రిగా, కీలక నాయకుడిగా గౌరవం దక్కించుకున్నారు. కానీ గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌లు త‌ర్వాత వైసీపీలోని అంతర్గత రాజకీయాలు, అక్కడి పరిస్థితుల కార‌ణంగా బయటకు వ‌చ్చిన బాలినేని జ‌న‌సేన‌లో చేరారు.

జనసేనలోకి అడుగుపెట్టినప్పుడే బాలినేని, పార్టీ లోపల పెద్ద స్థానాలు, ప్రాధాన్యం లభిస్తాయని భావించారు. ఎమ్మెల్సీ పదవి గాని, కీలక స్థానం గాని రావచ్చని ఆయన అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, పదవులు ఇవ్వకపోవడం ఆయనకు నిరాశ కలిగించింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జనసేన నేతలతో ఆయనకు సరైన కెమిస్ట్రీ కుదరడం లేదు. అటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేతో ఆయన విభేదాలు కూడా బహిరంగంగానే కనిపిస్తున్నాయి.

అదే సమయంలో స్థానిక జనసేన నాయకులు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో బాలినేని రాజకీయంగా ఒంటరితనం అనుభవిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీలో ఉన్నంత బలం జ‌న‌సేన‌లో బాలినేనికి ఏమాత్రం ద‌క్క‌డం లేదు. దీంతో జనసేనలో ఉండటం కంటే వైసీపీలో తిరిగి చేరడం లాభదాయకమని బాలినేని భావిస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ వైసీపీలోకి తిరిగి వెళ్లినా బాలినేనికి పాత మిత్రబంధువులు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల ఆయ‌న తిరిగి అక్కడ సాఫీగా కలిసిపోవచ్చు. మ‌రి బాలినేని నిజంగానే యూటర్న్ తీసుకుంటారా? లేక పవన్ కళ్యాణ్‌పై నమ్మకం ఉంచి జనసేనలోనే కొనసాగుతారా? అన్న‌ది చూడాలి.

Tags
Balineni Srinivasa Reddy YSRCP TDP Ap Politics Andhra Pradesh Janasena
Recent Comments
Leave a Comment

Related News