యూకేలోని లీడ్స్ లో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవ సమితి, ఎల్ఏటీఏ, టీటీడీ, ఏఫీఎన్నార్టీఎస్ లు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఈ వేడుకను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. టీటీడీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లికార్జున ప్రసాద్ సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. యూకేలోని శ్రీవారి భక్తులకు తిరుమల వైభవాన్ని అందించాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తిరుమల నుండి వచ్చిన ప్రధాన అర్చకులు శ్రీ రంగనాథ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఎదుర్కోలు, కంకణధారణ, వరమాలల మార్పిడి, మాంగళ్యధారణ వంటి కళ్యాణ ఘట్టాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో విజయ్ అడుసుమిల్లి , శ్రీకాంత్, అంబి చాళి, ఆనంద్ ముఖ్య పాత్ర వహించారు.
భక్తుల సౌకర్యార్థం ఎన్నో ఏర్పాట్లు చేశారు. లీడ్స్ తోపాటు యూకేలోని ఇతర నగరాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు, తెలుగు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ తర్వాత వారందరికీ టీటీడీ ప్రసాదం, అక్షింతలు పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఆచరించేందుకు శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు.
యూకే మరియు యూరప్ ప్రాంతాలలో జరిగే శ్రీనివాస కల్యాణాలు విజయవంతంగా సమన్వయం చేయడంలో యూరప్ ఏపీఎన్నార్టీఎస్ సమన్వయకర్త డా. కిషోర్ బాబు చలసాని, యునైటెడ్ కింగ్‌డమ్ ఏపీఎన్నార్టీఎస్ సమన్వయకర్త అడుసుమిల్లి విజయ్ కుమార్, సురేష్ కోరం కీలక పాత్ర పోషించారు.