ఎన్ని విమర్శలు వస్తున్నా సరే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. కానీ, తమకు కాస్త సంఖ్యాబలం ఉన్న శాసన మండలికి వెళ్లేందుకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, అక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలపై పోరాడడం లేదు. ఏదో మమ అనిపించాం అన్నట్లు ప్రశ్నలు అడిగి..అర్థం పర్థం లేని వాయిదా తీర్మానాలు అడిగి టైం పాస్ చేస్తున్నారు. ఆ కోవలోనే నేడు మండలిలో వైసీపీ ఎమ్మెల్యే బొత్స వర్సెస్ మంత్రి లోకేశ్ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు, మంత్రి లోకేష్ కు మధ్య వాడీవేడీ వాదనలు జరిగాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వైసీపీ వాయిదా తీర్మానం కోరింది. అయితే, మండలి ఛైర్మన్ ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై చర్చ జరిపేందుకు తాను సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. 4000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వాయిదా తీర్మానం అడగడం విడ్డూరంగా ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు.
నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స ఇప్పుడు శాసనమండలిలో ఉన్నారని, సభలో తాను పరుష వ్యాఖ్యలు చేసినట్లుగా బొత్స చేస్తున్న ఆరోపణలపై లోకేష్ మండిపడ్డారు. తాను ఏం మాట్లాడానో చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. బొత్స సీనియారిటీని గౌరవిస్తానని, కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఊరుకోబోనని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రిగా సభలో అన్ని అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఏ ఏడాది ఎంత ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయో అందరికీ తెలుసన్నారు.