ఇండియా, పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దాయాది దేశాల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల తర్వాత తొలిసారిగా ఇరు జట్లు ఆసియా కప్ లో తలపడ్డారు. ఆ సందర్భంగా నో షేక్ హ్యాండ్ వివాదం ఇరు దేశాల క్రీడాభిమానుల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. ఇక, సూపర్ 4 సందర్భంగా ఫకర్ జమాన్ నాటౌట్ అని పాక్ అభిమానులు చెబుతున్నారు. అయితే, థర్డ్ అంపైర్ నిర్ణయం ఫైనల్ అని...దానిపై వాదన అనవసరమని భారత్ ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ క్రమంలోనే క్రీడాస్ఫూర్తి గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ లో టీమిండియా వ్యవహరించిన తీరును చాలా దేశాల క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఇరు దేశాల మధ్య వైరం నేపథ్యంలో పాక్ తో మ్యాచ్ ఆడడం ఇష్టం లేకుంటే అసలు మ్యాచ్ ను బాయ్ కాట్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బీసీసీఐ కాసుల కోసం కక్కుర్తి పడి మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకుందని, కానీ, షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంలో మాత్రం ఆటగాళ్లకు ఆంక్షలు విధించిందని విమర్శిస్తున్నారు.
ఎటు చూసినా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను బలి పశువును చేసిందని బీసీసీఐ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. అయితే, సూర్య జెంటిల్మన్ మాదిరిగా పాక్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు వేరని, క్రీడలు వేరని ....రెండింటిని వేర్వేరుగా చూడాలని చెబుతున్నారు. ఇక, పాక్ క్రికెటర్లు కూడా ఆరు, సున్నా అంటూ సైగలు చేస్తూ భారత అభిమానులను కవ్వించే ప్రయత్నం చేస్తుండడం కూడా మంచిది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.