ఏపీ సీఎం చంద్రబాబు పక్కా ప్రొఫెషనల్ పొలిటిషియన్ అన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ సీరియస్ గా పని మీద ధ్యాస పెట్టే చంద్రబాబు ఈ మధ్య కాస్త సరదాగా సెటైర్లు వేస్తూ కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేడు అసెంబ్లీలో చంద్రబాబు తన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామను ఉద్దేశించి చంద్రబాబు చేసిన కామెంట్లతో సభ్యులంతా కాసేపు సరదాగా నవ్వుకున్నారు.
ప్రజల ఆహారపు అలవాట్లపై సభలో చంద్రబాబు ప్రస్తావించారు. నలభై ఏళ్లకే 120 ఏళ్లకు సరిపడా ఆహారాన్ని తింటున్నామని చంద్రబాబు సరదాగా కామెంట్స్ చేశారు. అదే సమయంలో స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్న రఘురామను చూస్తూ ఈ వ్యాఖ్యలు మీకూ వర్తిస్తాయి అధ్యక్షా అంటూ చంద్రబాబు సెటైర్ వేశారు. ఇక, ప్రధాని మోదీ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
మరోవైపు, పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి కూడా చంద్రబాబు సభలో మాట్లాడారు. దక్షిణాదిలో జనాభా పెరుగుదలపై నియంత్రణ ఉండాలని అన్నారు. ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో యువత సంఖ్య తగ్గిపోతోందని, మేమిద్దరం, మాకిద్దరూ అనే నినాదాన్ని వదిలేయాలని చెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధన ఉండేదని, ఏపీలో దానిని ఎత్తివేశామని అన్నారు.