ఆర్య యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ భవన నిర్మాణ ప్రారంభ కార్యక్రమం - సాన్ వాకిన్ కౌంటీకి చారిత్రక ఘట్టం!

admin
Published by Admin — September 24, 2025 in Politics, Andhra, Telangana, Nri, International
News Image

ఆర్య యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ భవన నిర్మాణ ప్రారంభ కార్యక్రమం - సాన్ వాకిన్ కౌంటీకి చారిత్రక ఘట్టం

సాన్ వాకిన్ కౌంటీ, కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని సాన్ వాకిన్ కౌంటీలో ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన ఆర్య యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (AUSOM) భవన నిర్మాణ ప్రారంభ కార్యక్రమం 2025, సెప్టెంబర్ 22న ఘనంగా జరిగింది. సాన్  వాకిన్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్‌లో ఈ చారిత్రక కార్యక్రమం నిర్వహించబడింది.   

వైద్య నిపుణుల కొరతను అధిగమించడం లక్ష్యం:
ఆర్య యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయానికి WASC గుర్తింపు ఉందని తెలిపారు. కాలిఫోర్నియాలో తీవ్రమైన వైద్య నిపుణుల కొరత ఉందని, 39.9 మిలియన్ల జనాభా ఉన్నప్పటికీ, కేవలం 13 మెడికల్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయని, ఇది 19 మిలియన్ల జనాభా ఉన్న న్యూయార్క్ (16 స్కూల్స్) కంటే చాలా తక్కువని వివరించారు. ఉత్తర కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ తర్వాత ఇది రెండవ ప్రైవేట్ లాభాపేక్ష లేని మెడికల్ స్కూల్ అవుతుంది. ఒక దశాబ్దానికి పైగా ప్రయత్నం, వేలాది గంటల శ్రమ మరియు మిలియన్ల డాలర్ల ఖర్చు తర్వాత ఈ ఘట్టానికి చేరుకున్నామని డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల పేర్కొన్నారు.

కౌంటీ మరియు హాస్పిటల్స్ మద్దతు:
ఈ ప్రాజెక్ట్‌కు సాన్ వాకిన్ కౌంటీ బోర్డ్ ఆఫ్ సూపర్  వైజర్స్ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చింది. కౌంటీ బోర్డ్ ఛైర్ పాల్ కనెపా, ఈ మెడికల్ స్కూల్ ద్వారా స్థానికులకు శిక్షణ ఇవ్వడం మరియు మెరుగైన ఆరోగ్య ఫలితాలు అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కౌంటీ 30 సంవత్సరాలకు గాను సంవత్సరానికి కేవలం $1 లీజుకు భవనాన్ని అందిస్తోంది, ఇది ఒక గొప్ప మద్దతు మాత్రమే కాదు మా బాధ్యత అని పేర్కొన్నారు.  

SJGH CEO  రిక్ కాస్ట్రో మరియు CMO డాక్టర్ షీలా కాప్రే, ఆర్య యూనివర్సిటీని రెండు చేతులతో ఆహ్వానించారు. SJGH 1857లో స్థాపించబడిందని, ఈ మెడికల్ స్కూల్ చేరికతో ఫ్రెంచ్ క్యాంప్ ఒక మెడికల్ సెంటర్‌గా అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్ట్ కోసం 1923-24 లో నిర్మించబడిన శతాబ్దపు పురాతన భవనాన్ని పునరుద్ధరించనున్నట్లు ఆర్య యూనివర్సిటీ చెయిర్‌మెన్ ప్రభాకర్ కల్వచర్ల తెలిపారు. క్లినికల్ రొటేషన్ల కోసం సేంట్ జోసెఫ్ మెడికల్ సెంటర్ మరియు సాన్ వాకిన్ జనరల్ హాస్పిటల్‌లతో ఒప్పందాలు కుదిరాయి అని తెలియజేసారు.
 
అకాడమిక్ మరియు నిధుల సేకరణ:
డాక్టర్ బాబ్ సస్కిండ్ (మూడు మెడికల్ స్కూల్స్‌ను స్థాపించిన వ్యవస్థాపక డీన్), డాక్టర్ ఆల్ఫ్రెడ్ టెనోర్ (21వ శతాబ్దపు మెడికల్ పాఠ్యప్రణాళిక అభివృద్ధిలో సూపర్‌స్టార్), మరియు టెరి వర్క్‌మన్‌ బృందం ఆర్య యూనివర్సిటీకి మద్దతు ఇస్తోంది.

ఈ కార్యక్రమానికి భారతదేశ కౌన్సిల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి హాజరై, భారతీయ డయాస్పోరా అమెరికన్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు చేసిన కృషిని ప్రశంసించారు.

నిధుల సేకరణలో ఉదారంగా విరాళాలు లభించాయి:
*   ఆరోగ్య సంరక్షణ సంస్థ చరిత్రలో తొలిసారిగా, హెల్త్ ప్లాన్ సాన్ వాకిన్ నుండి $2 మిలియన్ల గ్రాంట్ లభించింది.
*   డాక్టర్ హెన్రీ వాంగ్ $1 మిలియన్ విరాళం ఇచ్చారు.
*   డాక్టర్ హనిమిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై, నిరంతర ప్రోత్సాహంతో కూడిన అభినందనలు తెలిపారు.
*   డాక్టర్ రఘు రెడ్డి దంపతులు అమూల్యమైన మద్దతు ఇస్తూ, ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో తోడ్పడుతున్నారు.
*   లక్ష్యాన్ని చేరుకోవడానికి మొత్తం $50 మిలియన్లు అవసరం.

భవిష్యత్ లక్ష్యాలు:
స్టాక్టన్ మేయర్ క్రిస్టినా, ఈ మెడికల్ స్కూల్ ద్వారా విద్యార్థులు తిరిగి వచ్చి, సమాజానికి సేవ చేస్తారని, తద్వారా స్థానిక ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులను స్థానిక కాంట్రాక్టర్ బల్దేవ్ సింగ్ మరియు ఆయన కుమారుడు సన్నీ సింగ్ చేపట్టారు, వారు సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే లక్ష్యంతో లాభాపేక్ష లేకుండా పనిచేయడానికి ముందుకు వచ్చారు.

మెడికల్ స్కూల్‌ను 24 నుండి 30 నెలల్లో ప్రారంభించాలని ఆర్య యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫౌండింగ్ డీన్ డాక్టర్ సస్కిండ్, ఈ ప్రాజెక్ట్ సాన్ వాకిన్ వ్యాలీ ఆర్థిక వ్యవస్థపై వందల మిలియన్ల డాలర్ల ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేశారు. ఈ మెడికల్ స్కూల్ ద్వారా శిక్షణ పొందిన వైద్యులు (దాదాపు 90% మంది స్థానికంగానే ఉంటారని అంచనా) ఆరోగ్య అసమానతలను తగ్గించడంలో సహాయపడతారని అధికారులు విశ్వసిస్తున్నారు.
 
సభ చివరలో, ఆర్య యూనివర్సిటీ యొక్క దార్శనికత మరియు సమాజ భాగస్వామ్యాన్ని అభినందిస్తూ కాంగ్రెస్‌మెన్ జోష్ హార్డర్, స్టేట్ సెనేటర్ జెర్రీ మెక్నెర్నీ మరియు అసెంబ్లీ వుమెన్ రొడెషియా రాన్సమ్ కార్యాలయాల నుండి గుర్తింపు పత్రాలు (Certificates of Recognition) అందజేయబడ్డాయి.  కార్యక్రమంలో ఆర్య యూనివర్సిటీ CEO రాజు చమర్తి, మరియు  దేవేందర్ నరాల, ఎల్వా స్పార్ట్లింగ్, వెంకట్ గుడివాడ , మమత కూచిభొట్ల,  ప్రియ తనుగుల, మీనాక్షి గణెశన్ తదితరులు పాల్గొన్నారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Groundbreaking Ceremony Aria University School of Medicine San Joaquin County
Recent Comments
Leave a Comment

Related News