సినిమా స్క్రీన్ పై యాక్షన్ హీరోగా, రాజకీయాల్లో ఉగ్రరూపం కనబరిచే నాయకుడిగా బాలకృష్ణ ఇమేజ్ గురించి తెలిసిందే. అయితే చాలా మంది ఆయనను కోపిష్టి అని ముద్ర వేసేశారు. కానీ నిజంగా ఆయనను దగ్గరగా చూసినవారు మాత్రం విభిన్నమైన కోణాన్ని చెబుతారు. బాలయ్య మనసులో కోపం కన్నా చిన్నపిల్లాడి మాదిరి అమాయకత్వం, చిలిపితనం ఎక్కువని అంటారు. చమత్కారాలు కూడా ఎక్కువే చేస్తారు. తాజాగా తన సరదా వ్యాఖ్యలతో అసెంబ్లీలోని టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో నవ్వులు పూయించారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు హారయ్యారు. విరామ సమయంలో బాలయ్య స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఛాంబర్‌కు వెళ్లి కలిసి మాట్లాడారు. ఆ తర్వాత టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లి సందడి చేశారు. ఇక్కడో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీడీఎల్పీ కార్యాలయంలో పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాలయ్యతో ముచ్చటించారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.
ఈ క్రమంలోనే తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ `నేను తొలిసారి శాసనమండలికి వచ్చాను.. నన్ను ఆశీర్వదించండి అంకుల్` అనగానే.. వెంటనే బాలయ్య `నో అంకుల్.. ఓన్లీ బాలయ్య` అంటూ స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక ఈ సందర్భంగా `అఖండ-2` మూవీ గురించి కొందరు ప్రశ్నించగా.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఆ సినిమా గొప్ప విజయం సాధించాలి. ఆ తర్వాత మా సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది` అని బాలయ్య వెల్లడించారు.