వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ పై గోరంట్ల షాకింగ్ కామెంట్లు చేశారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ఇప్పుడు బయటకు వచ్చి పుష్కరోత్సవాలు జరుపుకుంటున్నారా అని గోరంట్ల ఎద్దేవా చేశారు.
అవినీతి ఆరోపణలతో జగన్ జైలుకు వెళ్లిన జగన్ విడుదలై 12 ఏళ్లు గడిచిందని చమత్కరించారు. జగన్ అక్రమాస్తుల విచారణ చివరి అంకానికి చేరుకుందని, ఈ కేసుల్లో జగన్ కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందోనని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుని అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలను దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని వ్యాప్తి చేసేందుకే తాడేపల్లి ప్యాలెస్ లో బూతోత్సవం నిర్వహించారని సెటైర్లు వేశారు.
ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని జగన్ పట్టుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నట్టేట ముంచారని, మళ్ళీ ప్రజలు జగన్ చేతిలో మోసపోరని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని, అది చూసి ఓర్వలేక పనిగట్టుకుని మరీ వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మడం ఎప్పుడో మానేశారని, ఆ విషయాన్ని వైసీపీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని చురకలంటించారు.