వైసీపీ పాలనలో అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. అమరావతిని శ్మశానంతో పోలుస్తూ అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇక చినుకు పడితే అమరావతి మునిగిపోతుందంటూ వైసీపీ నేతలు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై శాసనసభ సమావేశాల సందర్భంగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ కుట్రల వల్ల అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని మెల్లమెల్లగా సరి చేస్తున్నామని నారాయణ చెప్పారు. వైసీపీ విధ్వంసకర పాలనకు భయపడి గతంలో పనులు చేసిన కొంతమంది కాంట్రాక్టర్లు ఇప్పుడు ముందుకు రావడంలేదని ఆరోపించారు. అందుకోసం కొత్తగా మళ్లీ టెండర్లను ఆహ్వానించాల్సి వస్తుందని చెప్పారు. ప్రపంచ బ్యాంకు ద్వారా అమరావతి రాజధాని నిర్మాణానికి రుణాలు తీసుకున్నామని, ప్రణాలికాబద్ధంగా పనులు జరుగుతున్నాయని నారాయణ వెల్లడించారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రాజధాని భూమి పూజ జరిగిందని, మొత్తం పనులు పూర్తయిన తర్వాత ఆయన చేతుల మీదుగానే అమరావతి రాజధానిని ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతిలో సీఆర్డీఏ ద్వారా 21 పనులు, ఎడిసి ద్వారా 64 పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులలో ప్రస్తుతం 10,000 మంది కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు.
అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడిందని నారాయణ మండిపడ్డారు. అమరావతిలో అడవి మాదిరిగా పెరిగిన చెట్లను తొలగించేందుకు దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ట్రంకు రోడ్డు, లేఅవుట్ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిల బంగ్లాలు, అధికారుల, ఉద్యోగుల నివాస నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మార్చి 31, 2026 నాటికి 3500 ఫ్లాట్ల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఇకనైనా వైసీపీ నేతలు అమరావతిపై విష ప్రచారం మానాలని హితవు పలికారు.