తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారం అడ్డుపెట్టుకొని వైఎస్ జగన్ వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో ఈడీ విచారణను ఎదుర్కొన్న జగన్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇంకా జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పెండింగ్ లో ఉంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ఈడీ విచారణ పూర్తయితే ఏ క్షణంలో అయినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో నేను తాజాగా జగన్ పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో జగన్ జైలుకు వెళ్లి బయటకు వచ్చి 12 ఏళ్లు పూర్తయ్యాయని కామెంట్స్ చేశారు. ఆ సందర్భంగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం పెట్టుకున్నారంటూ గొట్టిపాటి సెటైర్లు వేశారు. అవినీతి, కుంభకోణాల నేపథ్యంలో జైలుకు వెళ్లి వచ్చినందుకు బహుశా ఈ రోజు వేడుకలు చేసుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు.
అమరావతిలో సీఆర్డీఏ భవన నిర్మాణ పనులను పరిశీలించిన గొట్టిపాటి సీఆర్డీఏ భవనంలో విద్యుత్ సంబంధిత పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేయాలని ఆదేశించారు. జగన్ ఐదేళ్ల పాలన లేకుంటే అమరావతిలో ఇప్పటికే సకల సౌకర్యాలు వచ్చేవని చెప్పారు. అమరావతి కోసం రైతులు చేసిన భూ త్యాగం మర్చిపోలేమని, వారికి ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం కచ్చితంగా నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదని, కాబట్టి రాలేదని, దానిపై రాద్ధాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు.