వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై కక్షపూరితంగా వందలాది కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి ఏ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా, జగన్ పాలనను ప్రశ్నించినా ఏదో ఒక అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం పరిపాటిగా మారిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ పాలనలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై నమోదైన కేసుల వివరాలను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.
జగన్ హయాంలో అందరూ బాధితులేనని, తనపై 17 కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. కేసులు ఎందుకు పెట్టారో చెప్పమని అడిగితే సమాధానం ఉండదని, కేసు వివరాలు వాట్సాప్లో పంపిస్తామని చెప్పడం అరాచక పాలనకు పరాకాష్ట అని అన్నారు. తాను తప్పు చేయనని, అందుకే తనపై ఎవరు కేసులు పెట్టలేదని అన్నారు. తాను తప్పు చేయనని, తప్పు చేసినవారిని వదలనని చంద్రబాబు.... వైసీపీ నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు పెట్టారని, 45 సార్లు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని గుర్తు చేసుకున్నారు. దేవినేని ఉమపై 27 కేసులు, చింతమనేని ప్రభాకర్ పై 40 కేసులు, పులివర్తి నానిపై 31, ఆంజనేయులుపై 16, అయ్యన్నపాత్రుడుపై 14, బీటెక్ రవి పై 14, కూన రవికుమార్ పై 15, కాల్వ శ్రీనివాసులుపై 14 కేసులు పెట్టారని గుర్తు చేసుకున్నారు.
లోకేష్, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారిని కూడా కేసులు పెట్టి సతాయించారని గుర్తు చేసుకున్నారు. ఇక, అదే సమయంలో స్పీకర్ స్థానంలో కూర్చుని ఉన్న రఘురామను ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షా మీపై పెట్టిన కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ప్రపంచమంతా చూసింది అని రఘురామ కస్టోడియల్ టార్చర్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు.