పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఓజీ’ బాక్సాఫీస్ జాతరకు రంగం సిద్ధమైంది. మామూలుగా యుఎస్‌లో ఫస్ట్ షో పడిపోతుంటుంది. కానీ రిలీజ్ ముందు రోజు సెకండ్ షోను పెయిడ్ ప్రిమియర్‌గా వేస్తుండడంతో ఫస్ట్ షోకు ఇండియానే వేదిక కానుంది. యుఎస్ షోలు కొంచెం లేటుగా మొదలవుతాయి. ఐతే యుఎస్ సహా పలు దేశాల్లో ‘ఓజీ’ సంబరాలకు పెద్ద ఎత్తున సిద్ధం అయ్యారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ వాళ్లకు అన్ని వైపుల నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి. సంబరాలు శ్రుతి మించకుండా చూసకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం యుఎస్‌లో పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఇండియన్స్, ముఖ్యంగా తెలుగువాళ్ల ఆధిపత్యం రోజు రోజుకు పెరిగిపోతుండడం నేటివ్ అమెరికన్స్‌కు రుచించట్లేదు. హిందూ పండుగలప్పుడు జరిగే హంగామా.. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు జరిగే ర్యాలీలు.. థియేటర్లలో జరిగే కోలాహలం అక్కడి వారిని ట్రిగ్గర్ చేస్తోంది. ఇటీవల వారిలో అసహనం పెరిగిపోతోంది. మన స్టార్ హీరోల ఫ్యాన్స్ కొన్ని సందర్భాల్లో మరీ అతి చేస్తున్న మాట కూడా వాస్తవం అని మనవాళ్లే అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం యుఎస్ అనే కాక పలు దేశాల్లో పరిస్థితులు సున్నితంగా మారుతున్నాయి. తమ దేశంలో విదేశీయులు హల్‌చల్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘ఓజీ’ సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ కొంచెం సంయమనంతో వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక హీరో అభిమానులకు పోటీగా ఇంకో హీరో అభిమానులు హంగామా చేయడం ఇప్పటిదాకా చెల్లింది. కానీ ఇప్పుడు అలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని.. హెచ్-1బి వీసా గొడవ చూశాక అయినా.. హంగామా కట్టిపెడితే మంచిదని.. పవన్ ఫ్యాన్స్ అనేకాక మున్ముందు అందరు హీరోల అభిమానులూ సంయమనం పాటించడం అవసరమే చర్చ జరుగుతోంది.