2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా... జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. దీంతో జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబోధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు శాసనమండలిలో చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించడంతో పెను దుమారం రేగింది. సూపర్ సిక్స్ అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానిస్తూ చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అని రమేష్ యాదవ్ అనడంతో టీడీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కుప్పం ఎమ్మెల్యే అని అగౌరవకరంగా పిలవడంపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించి రమేష్ పై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ ను కోరారు. అంతేకాకుండా సభకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, ముఖ్యమంత్రి సభా నాయకుడని, ఆ విషయాన్ని వైసీపీ సభ్యులు మర్చిపోతే ఎలా అని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రశ్నించారు. రికార్డులు పరిశీలించి వెంటనే ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ ను కోరారు.
ఈ క్రమంలోనే సభలో ఇరు పక్షాల నేతల మధ్య వాగ్వాదాల నడుమ గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో మండలి చైర్మన్ కాసేపు సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత రికార్డులను పరిశీలించిన శాసనమండలి చైర్మన్.... రమేష్ యాదవ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తేల్చారు. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామన్నారు. పెద్దల సభలో హుందాగా వ్యవహరించాలని సభ్యులకు హితవుపలికారు. అయితే, జగన్ ను కూటమి పార్టీల సభ్యులు పులివెందుల ఎమ్మెల్యే అని పిలిచినంత కాలం తాము కూడా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యానించారు.