వైసీపీ హయాంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులను జగన్ తన ఇంటికి పిలిచి అవమానించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అంశం ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావనకు రాగా...బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఆ రోజు జరిగిన విషయం గురించి ప్రజలకు వివరణ ఇవ్వదలుచుకున్నానని చిరంజీవి అన్నారు.
జగన్ హయాంలో కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తన దగ్గరకు వచ్చి టికెట్ల ధరల పెంపు గురించి ఏపీ ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అడిగారని చిరంజీవి చెప్పారు. వారి సూచనల ప్రకారం అప్పటి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఆ తర్వాత సీఎం జగన్ తనతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారని తనకు నాని ఫోన్ చేశారని అన్నారు. ఆ క్రమంలోనే జగన్ ఇంటికి లంచ్ కి వెళ్లానని, ఆ సమయంలోనే సినీ పరిశ్రమ ఇబ్బందులను గురించి వివరించానని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి 10 మంది వెళ్లి జగన్ ను కలిశామని చిరు అన్నారు. ఆ సమయంలో బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు తాను ప్రయత్నించానని, అయితే బాలకృష్ణ అందుబాటులోకి రాలేదని తెలిపారు. జెమిని కిరణ్ ను వెళ్లి బాలకృష్ణని కలవాల్సిందిగా చెప్పానని, ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కలవలేకపోయారని చెప్పారు. పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని జగన్ ను తాను కోరానని, ఈ విషయాలకు అక్కడున్న వారందరూ సాక్ష్యమేనని అన్నారు.
ఆ తర్వాతే సినిమా టికెట్ల రేట్లు పెంచారని, దాంతో తన వాల్తేరు వీరయ్య సినిమాకు, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాకు టికెట్ రేట్లు పెరిగి డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభం వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైన తాను గౌరవం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటానని అన్నారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నందున లేఖ ద్వారా ఆ రోజు జరిగిన విషయాలను ప్రజలకు వివరిస్తున్నానని అన్నారు.