వైసీపీ హయాంలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, బెనిఫిట్ షోల రద్దు వంటి వ్యవహారాలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు సినీ ప్రముఖులను తన ఇంటికి పిలిచి జగన్ అవమానకర రీతిలో మాట్లాడిన వైనం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ అంశం ఈరోజు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. చిరంజీవితో పాటు ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు జగన్ ఇంటికి వచ్చారని, అయితే జగన్ వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పారు.
ఆ తర్వాత చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆ తర్వాత వాళ్లతో మాట్లాడి పంపించారని అన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఖండించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారు అన్నది పచ్చి అబద్ధమని బాలయ్య అన్నారు. సైకోను కలిసేందుకు ఇండస్ట్రీ నుంచి కొందరు వెళ్లారని జగన్ ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. గట్టిగా ఎవరూ అడగలేదని, సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని చెప్పారని అన్నారు.