2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం 150 రోజుల రికార్డు టైం లో మెగా డీఎస్సీ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
15940 మంది మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాలు అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో టాప్ 20 లో నిలిచిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 150 రోజుల రికార్డు సమయంలో డీఎస్సీ పూర్తి చేసిన విద్యా శాఖ మంత్రి లోకేష్ కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. మెగా డీఎస్సీ మెగా హిట్ అయిందని చంద్రబాబు అన్నారు.
తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించానని, ఎకనామిక్స్ ప్రొఫెసర్ నారాయణ రాజకీయాల వైపు తనను ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులు గుర్తించాలని, ప్రోత్సహించే వారు ఉంటే ఆకాశమే హద్దుగా పిల్లలు దూసుకుపోతారని అన్నారు. ప్రపంచంలో జరుగుతున్న మార్పుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యువత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు.