మెగా డీఎస్సీ 2025లో విజయం సాధించిన డీఎస్సీ అభ్యర్థులకు ఈరోజు నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని అమరావతి సమీపంలోని వెలగపూడిలో చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాధినేత అయినా సరే గురువు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందేనని అన్నారు. సీఎం చంద్రబాబు తన జీవితకాలపు గురువని గర్వంగా చెప్పారు. పదో తరగతి వరకు సాధారణ విద్యార్థినైన తాను ఫండమెంటల్ లో చురుగ్గా లేనని నారాయణ పాఠాలు చెప్పారని గుర్తు చేసుకున్నారు.
అమెరికాలో ప్రొఫెసర్ రాజిరెడ్డి విద్యా వ్యవస్థ గురించి అవగాహన కల్పించాలని అన్నారు. వారి వల్ల తాను ఈరోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తానని నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చానని, అందుకే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టామని చెప్పుకొచ్చారు. సీబీఎన్ అంటే డీఎస్సీ అని... డీఎస్సీ అంటే సిబిఎన్ అని లోకేష్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 15 డీఎస్సీలు నిర్వహిస్తే...టీడీపీ హయాంలో 14 డీఎస్సీలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. టీడీపీ పాలనలో దాదాపు రెండు లక్షల మంది టీచర్లను నియమించామని అన్నారు. 150 రోజుల్లో 150 కేసులు వేసినా నియామకాలు పూర్తి చేశామని, సమిష్టి కృషివల్లే మెగా డీఎస్సీ మెగా హిట్ అయిందని అన్నారు. ఈ ఏడాది నవంబర్ లో టెట్ నిర్వహిస్తామని వచ్చే ఏడాది మళ్ళీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని లోకేశ్ ప్రకటించారు. అంతకుముందు అమరావతి సమీపంలోని వెలగపూడి కి 66 బస్సుల్లో డీఎస్సీ విజేతలు తరలి వెళ్లారు.