ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ ను హీరో చిరంజీవి తో పాటు పలువురు సినీ ప్రముఖులు కలిసిన విషయంపై ఆయన చేసిన కామెంట్లు సరికొత్త వివాదానికి తెర లేపాయి. కామినేని వ్యాఖ్యలు అవాస్తవమని చిరంజీవి అడిగితే జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లు మెగా అభిమానులకు కాస్త ఆగ్రహం తెప్పించాయి.
ఈ నేపథ్యంలోనే తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని కామినేని శ్రీనివాస్ ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు. తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయనే అభిప్రాయం కలిగిందని, అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీ రికార్డుల నుంచి తన మాటలను తొలగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడును కామినేని శ్రీనివాస్ కోరారు. దీంతో, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆరోజు జగన్ తో జరిగిన మీటింగ్ గురించి తాను వాస్తవాలు వెల్లడించాల్సి వచ్చిందని చిరంజీవి ఒక లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.