ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రతి ఇంటికి అందవలసిన పథకాల చిట్టాను ఈరోజు కేటీఆర్ తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపిస్తామని, అప్పుడు ప్రజలు కాంగ్రెస్ నేతల గల్లా పట్టుకొని అడుగుతారని అన్నారు.
ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడి.. ఎన్నికల తర్వాత గజినీకాంత్ లాగా రేవంత్ రెడ్డి మారిపోయారని ఎద్దేవా చేశారు. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు.. కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అంటూ చురకలంటించారు. అందులో కూడా రెండు రకాల కటింగులున్నాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వాటికి రిబ్బన్ కటింగులు, ఇంకోటి ఏమో కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలను కటింగులు అని హరీష్ రావు పంచ్ డైలాగులు కొట్టారు.
ఇవాళ ప్రజలు ఏ రకంగా తిరగబడ్డారో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో చూశామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడుతోందని హరీష్ రావు జోస్యం చెప్పారు.