టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆసియా కప్ ఫైనల్లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ లో భారత్ ను తిలక్ వర్మ ఒంటి చేత్తో గెలిపించాడు. చిరకాల ప్రత్యర్థి పాక్ పై చిరస్మరణీయ విజయంలో ఈ తెలుగు కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలోనే తిలక్ వర్మకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో, లోకేష్ కు ప్రేమతో ఫైనల్ మ్యాచ్లో తాను ఉపయోగించిన క్యాప్ ను బహుకరిస్తానని తిలక్ వర్మ చెప్పాడు. తమ్ముడు తిలక్ వర్మ బహుమతి తనకు ఎంతో ప్రత్యేకమైనదని, స్వదేశానికి వచ్చిన తర్వాత అతడి చేతుల మీదుగానే ఆ క్యాప్ తీసుకుంటానని లోకేష్ అన్నారు. డియర్ లోకేష్ గారు అంటూ క్యాప్ పై తిలక్ వర్మ సంతకం చేస్తున్న ఫోటో వీడియోను లోకేష్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అంతకుముందు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలతో గతంలో కలిసి దిగిన ఫోటోను లోకేష్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆసియా కప్ లో అద్భుతంగా రాణించారని లోకేష్ ప్రశంసించారు.