ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీకి సంబంధించిన చాలా కార్యాలయాలు హైదరాబాద్ నుంచే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అమరావతిలో పలు భవనాల నిర్మాణాలు జగన్ పుణ్యమా అంటూ ఆగిపోయాయి. మరికొన్ని అసలు మొదలు కాలేదు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి పలు సంస్థలు నిర్మాణాలు చేపట్టేందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్10 రోడ్డు వద్ద టీడీపీ ప్రభుత్వం వివిధ బ్యాంకులకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు మొదలుకాబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ఎకరాలు, ఆప్కాబ్ కు 2 ఎకరాలు, కెనరా బ్యాంకు, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు తదితర వాటికి 25 సెంట్లు చొప్పున ఒకే చోట భూమి కేటాయించారు. ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాన్నీ 14 అంతస్తులు, లక్ష చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మించనున్నారు.
నిర్మాణ పనులు ప్రారంభించేందుకు బ్యాంకర్లు సన్నాహాలు చేస్తున్నారు. స్టేట్ బ్యాంకుకు కేటాయించిన స్థలంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభా వేదికపై నుంచే అన్ని బ్యాంకుల భవనాల నిర్మాణాలకూ ఒకేసారి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్చీఐ గవర్నర్, ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే అమరావతిలో ఎస్బీఐ భవనం నిర్మాణం డిజైన్ ఖరారైంది. అత్యాధునిక లుక్ తో ఈ బిల్డింగ్ ఆకట్టుకుంటోంది.