ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు విజయ దశమిని ఘనంగా జరుపుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు ప్రధాని మోదీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ, ప్రజలందరిలో ధైర్యం నింపాలని మోదీ ఆకాంక్షించారు. ప్రజలందరూ వివేకంతో ముందుకు సాగే స్ఫూర్తిని వారిలో నింపాలని మోదీ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ.
మరోవైపు, రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలిపారు. "తెలుగు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. సకల చరాచర జీవరాసులను సంరక్షించే శక్తి స్వరూపిణి అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి" అని చంద్రబాబు ఆకాంక్షించారు.
తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని అన్నారు. అప్రతిహత విజయాలతో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని దుర్గమ్మను రేవంత్ రెడ్డి ప్రార్థించారు. ఇక, భక్తిశ్రద్ధలతో శరణు శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక శోభను విరాజిల్లుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భవానీ దీక్షలతో దసరా ఉత్సవాలు మరింత శోభ సంతరించుకున్నాయన్నారు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. సంక్షేమం, అభివృద్ధితో మహా యజ్ఞాన్ని కొనసాగించే బలం ఇవ్వాలని, ప్రతి ఇంట దసరా పండుగ వెలుగులు నింపాలని లోకేష్ కోరారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. 'విజయ' అంటే గెలుపు, 'దశమి' అంటే పదవ రోజు అని అర్థం.