కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ వైసీపీ మాజీ మంత్రి అంజాద్ బాషా, ఆయన సోదరుడు, అంజాద్ బాషా పీఏపై కడప వన్ టౌన్ సీఐ రామకృష్ణ యాదవ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంజాద్ బాషా, ఆయన సోదరుడిపై కేసు ఎందుకు నమోదు చేశారంటూ రామకృష్ణ యాదవ్ ను పోలీసు ఉన్నతాధికారులు మందలించినట్లు తెలుస్తోంది. కారణాలు తెలియదు గాని...కేసు పెట్టిన కొద్ది గంటల్లోనే రామకృష్ణ యాదవ్ ను వీఆర్ కు పంపుతూ జిల్లా ఎస్పీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం నేర్పింది.
ఈ క్రమంలోనే ఈ విషయంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ రామకృష్ణ యాదవ్ ను యధాస్థానంలో నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో రామకృష్ణ యాదవ్ పై లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను అప్పటి ప్రభుత్వం వీఆర్ కు పంపింది. అటువంటి రామకృష్ణ యాదవ్ ను కూటమి ప్రభుత్వంలో సైతం వీఆర్ కు పంపడంతో తెలుగు తమ్ముళ్లు కూడా ఆశ్చర్యపోయారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఎస్పీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.