తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ మూడో తేదీన దామోదర్ రెడ్డి భౌతికకాయాన్ని ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్ లో ఉంచనున్నారు. అదే రోజు సాయంత్రం ఆయన భౌతిక కాయాన్ని సూర్యాపేటకు తరలించబోతున్నారు. అక్టోబర్ 4వ తేదీన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దామోదర్ రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇక, దామోదర్ రెడ్డి మరణం పార్టీకి తీరనిలోటని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు అన్నారు.
పాత తరం కాంగ్రెస్ నాయకుల్లో ఒకరైన దామోదర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేయగా నాలుగు సర్లు గెలిచారు. 2009లో సూర్యపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు 2014 2018 2023 ఎన్నికల్లో ఓడిపోయారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాలను తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు.