హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఏ రేంజ్ లో అభివృద్ధి చెందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ గుర్తింపు తెచ్చుకుంది. ముంబై తర్వాత. అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ ప్రతిరోజు వేలాదిమంది ఈ భాగ్యనగరానికి తరలివస్తుంటారు. పెరిగిన జనాభాకు తగ్గట్లుగా నగరంలో భారీగా ట్రాఫిక్ పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లేందుకు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు శాపంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంత ప్రయాణికులకు భారీ ఊరట కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్యారడైజ్ నుంచి షామీర్ పేట్ వరకు భారీ ఎలివేటెడ్ కారిడార్ ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మించనుంది. ఇందుకు సంబంధించి తాజాగా టెండర్లను హెచ్ ఎండీఏ ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కానుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి షామీర్ పేట్ వరకు మొత్తం 18.17 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించబోతున్నారు. 2232 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును హెచ్ఎండిఏ చేపట్టనుంది.
ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ అనుమతులు జారీ చేసింది. ఈ మొత్తం కారిడార్ లో 11.65 కిలోమీటర్ల భాగాన్ని పూర్తిగా ఉక్కుతో నిర్మించబోతున్నారు. దేశంలోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా ఇది రికార్డు సృష్టించనుంది. పునాదులు మాత్రమే కాంక్రీట్ తో నిర్మించి పై వంతెన మొత్తం స్టీల్ తో పటిష్టంగా తక్కువ సమయంలో చేపట్టేలాగా అధికారులు డిజైన్ చేశారు. అంతేకాదు, హకీంపేట్ ఆర్మీ ఎయిర్ పోర్ట్ సమీపంలో 450 మీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానుంది.