ప్రపంచాన్ని యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి భారత్ చేరుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ఒక నినాదంగా మిగిలిపోకూడదని, అదొక మహోద్యమంగా మారితేనే దేశం ఆర్థికంగా అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. మన దేశానికున్న అతిపెద్ద బలం, సంపద జనాభా అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ భారత్ అని, ‘బీ ఇండియన్, బై ఇండియన్’ అనే నినాదం ప్రతి ఒక్కరిలో రావాలని, మన ఉత్పత్తులను మనమే వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మన దేశం అత్యంత పటిష్టమైన స్థితిలో ఉందని, ఒకప్పుడు చిన్న శాటిలైట్ ప్రయోగానికి కూడా ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉపగ్రహాలు తయారు చేసి ప్రయోగించే స్థాయికి చేరుకున్నామని, కోవిడ్ మహమ్మారి సమయంలో మన దేశంలో తయారైన వ్యాక్సిన్లే ప్రపంచ దేశాల ప్రజల ప్రాణాలను కాపాడిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందదని, 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మన దేశం అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.