ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును జగన్ సర్కార్ ఎంత టార్చర్ పెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. జగన్ అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో రఘురామను కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన వైనం అప్పట్లో సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రఘురామ సంచలన విషయాలు వెల్లడించారు.
వ్యక్తిగతంగా తాను సక్సెస్ అయ్యానని, కానీ, ఒక పొలిటిషియన్ గా ఫెయిల్ అయ్యానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలోని ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, కఠిన సవాళ్లను అధిగమించానని చెప్పారు. ఒక ఎంపీగా గెలిచిన ఆరు నెలలకే తన సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేని పరిస్థితిని కల్పించారని అన్నారు. ప్రభుత్వ పనితీరును, విధానాలను ప్రశ్నించినందుకు తనపై అనర్హత వేటు వేయాలని ఆనాటీ సీఎం, ఆ పార్టీ మొత్తం శాయశక్తులా ప్రయత్నించిందని గుర్తు చేసుకున్నారు.
చివరి నిమిషం వరకు తనకు కనీసం ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని, ఒక రాజకీయ నాయకుడిగా పదవిలో ఉంటూ ప్రజా సేవ చేయాలని కోరుకున్నానని, కానీ, ఆ అవకాశాలు తనకు లేకుండా చేశారని చెప్పారు. అందుకే ఓ రాజకీయ నాయకుడిగా తాను విఫలమయ్యానని భావిస్తానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కస్టడీలోకి తీసుకుని తనను దారుణంగా కొట్టారని, ఆ ఘటనతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనుకున్నారని చెప్పారు. కానీ, ఆ దెబ్బలు తనలో కసిని, పోరాట పటిమను రెట్టింపు చేశాయని, అది తనకు ఒక 'పునర్జన్మ'గా భావించానని తెలిపారు.