ఒక పేరున్న నిర్మాత సంస్థలో ఒక పెద్ద సినిమాలో నటించిన నటుడు విదేశాల నుంచి ఇండియాకు డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోవడం సంచలనం రేపుతోంది. ఆ నటుడి పేరు.. విశాల్ బ్రహ్మ. అతను కరణ్ జోహార్ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2 చిత్రంలో నటించాడు. ఈ సినిమా రిలీజై ఐదేళ్లే అయింది. ఐతే ఈ సినిమా తర్వాత విశాల్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న అతను డ్రగ్స్ రవాణా చేస్తూ చెన్నై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులకు దొరికిపోయాడు. తన బ్యాగులో ఏకంగా రూ.40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు ఉన్నట్లు వెల్లడైంది. అస్సాంకు చెందిన విశాల్.. డబ్బు కోసం స్నేహితుల ద్వారా ఒక డ్రగ్ ముఠాను కలిసినట్లు తెలుస్తోంది.
నైజీరియాకు చెందిన ఆ ముఠా.. విశాల్ బ్రహ్మను కాంబోడియాకు పంపి, అక్కడి నుంచి డ్రగ్స్ తెప్పించడానికి ప్లాన్ చేశారు. ఈ ట్రిప్ ఖర్చులన్నీ తామే భరించి, డ్రగ్స్ తెప్పించాక.. అందులో కొంత వాటా ఇస్తామని అతడికి ఆశ చూపారట. రెండు వారాల కిందట విశాల్.. ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. అక్కడ ఒక నైజీరియన్ అతడికి డ్రగ్స్‌తో ఉన్న బ్యాగు ఇచ్చి పంపాడు.
కాంబోడియా నుంచి సింగపూర్ మీదుగా చెన్నైకి చేరుకుని.. అక్కడ్నుంచి ఢిల్లీ చేరుకునేలా రూట్ మ్యాప్ వేసి అతణ్ని విమానం ఎక్కించారు. కానీ చెన్నైలో అధికారుల తనిఖీలో డ్రగ్స్ బయటపడ్డాయి. కాస్త పేరున్న నటుడు ఇలాంటి పని చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. డబ్బుకు ఆశపడి ఈ రొంపిలోకి దిగిన విశాల్ బ్రహ్మ.. ఇప్పుడు ఊచలు లెక్కబెట్టాల్సిన స్థితికి చేరుకున్నాడు.