టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలా కూటమి పార్టీల శాసనసభ్యుల ప్రసంగాలు ఉండకూడదని అన్నారు. శాసనసభ్యులతో మంత్రుల సమన్వయం లోపిస్తే పరిపాలన దెబ్బతింటుందని చెప్పారు.
శాఖాపరమైన విమర్శలు వచ్చినప్పుడు కూడా సంబంధిత శాఖల మంత్రులు గట్టిగా స్పందించాలని, తగిన విధంగా జవాబులు ఇవ్వాలని ఆదేశించారు. ఏది ఏమైనా కొందరు ఎమ్మెల్యేల నోటికి తాళం వేసిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా సుధీర్ రెడ్డి, బోండా ఉమ, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.