దసరా కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజైంది ‘కాంతార: చాప్టర్-1’. ఇది కన్నడ సినిమా అయినప్పటికీ.. తెలుగు, తమిళంలో, హిందీలోనూ మంచి హైప్ క్రియేటైంది. మూడేళ్ల ముందు ‘కాంతార’ రేపిన సంచలనం అలాంటిది మరి. ట్రైలర్‌కు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో బజ్ తగ్గినట్లు అనిపించింది కానీ.. రిలీజ ్ రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లు జనాలతో కళకళలాడాయి.
హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ.. వాకిన్స్ గట్టిగా ఉండడంతో ‘కాంతార: చాప్టర్ 1’ మీద పెట్టుబడులు పెట్టిన వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇక సినిమాకు టాక్ పాజిటివ్‌గానే ఉంది. అన్ని భాషల్లోనూ రివ్యూలు కూడా సానుకూలంగానే వచ్చాయి. దీంతో ‘కాంతార: చాప్టర్’ బాక్సాఫీస్ విన్నర్ అయ్యే సంకేతాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.80 కోట్ల మేర గ్రాస్, 60 కోట్ల వరకు నెట్ వసూళ్లు రాబట్టింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే దసరా రిలీజ్‌ల్లో ఇప్పటిదాకా ఇదే హైయెస్ట్ గ్రాసర్ కావడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం వేట్టయాన్ రూ.37 కోట్ల నెట్ వసూళ్లతో నెలకొల్పిన రికార్డు బద్దలైంది. తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ కలెక్షన్లు అంచనాలకు తగ్గట్లే వచ్చాయి. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.15 కోట్ల మేర ఈ సినిమా తొలి రోజు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
కన్నడలో కేజీఎఫ్ తర్వాత అత్యధిక తొలి రోజు వసూళ్లు ఈ చిత్రమే రాబట్టింది. తొలి రోజు స్పందన చూస్తే వీకెండ్లో ‘కాంతార: చాప్టర్-1’ వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా సెలవుల అడ్వాంటేజీని ఈ చిత్రం బాగా ఉపయోగించుకునేలా ఉంది. కన్నడ, హిందీ భాషల్లో సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశాలున్నాయి. ఫుల్ రన్లో రూ.500 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రావచ్చు.