ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 కిలో మీటర్ల దూరాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రి నారా లోకేష్, బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్‌లు కలసి ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు ఆటో డ్రైవర్ల కుటుంబాలతో మమేకమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును తెలుసుకున్నారు. వారికి అందుతున్న పథకాల వివరాలను కూడా నమోదు చేసుకున్నారు.
తొలుత మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్, విజయవాడ నుంచి బీజేపీ చీఫ్ మాధవ్‌లు తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉన్న సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. అనంతరం.. అక్క డ ఏర్పాటు చేసి ఉంచిన నాలుగు ఆటోల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేస్, మాధవ్‌లు ఆటోలో ఎక్కారు. అక్కడ నుంచి బయలు దేరిన ఆటోలు.. విజయవాడ సింగ్‌నగర్‌లో ఉన్న మాకినేని బసవపున్న య్య స్టేడియంకు వచ్చారు. ఈ సమయంలో వారు ఆటో డ్రైవర్ల కుటుంబాల సమస్యలు తెలుసుకున్నా రు.
ఈ సమయంలో నలుగురు నాయకులు కూడా.. ఆటో డ్రైవర్లు ధరించే ఖాకీ చొక్కాలనే వేసుకున్నారు. అదేవిధంగా ఆటో సమస్యలు, పెట్రోలు, డీజిల్ ధరలు, సీఎన్‌జీ గ్యాస్ ధరలను తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ఒనగూరుతున్న లబ్ధిని కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. సీఎం చంద్రబాబు తన ప్రసంగానికి ముందు.,. సభ వేదికపైకి.. తాను కలిసి ప్రయాణించి వచ్చిన ఓ డ్రైవర్ కుటుంబాన్ని పిలిచారు. వారి సమస్యలను సభా వేదికపైనే ఆయన వివరించారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని చంద్రబాబు అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ పరదాలు కట్టుకుని జనం మధ్యకు వచ్చేవారని, ఈ రోజు తాము ఆటోల్లో ప్రజల మధ్య స్వేచ్ఛగా ప్రయాణిస్తూ సభా వేదికకు చేరుకున్నామని అన్నారు.
అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ.. గత ప్రభుత్వం ఎలా వేధించిందో వివరిస్తూ.. సీఎం చంద్ర బాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. పది వేల రూపాయలను ఆటో డ్రైవర్లకు ఇచ్చిన గత ప్రభుత్వం రహదారులపై గుంతలు కూడా పూడ్చకుడా.. 20 వేల రూపాయలు ఖర్చయ్యేలా చేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే రహదారులు నిర్మించామన్నారు. అదేవిధంగా వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున చలాన్లు రాశారని.. తాము వచ్చాక వాటిని సరళీకరించామన్నారు. ఆటో వాలా జిందాబాద్ అంటూ.. ఆయన ప్రసంగంలో పలు మార్లు వ్యాఖ్యానించారు.